
- పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
- ప్రమాదం అంచును భక్తుల మనోభావాలు
- వేములవాడలో మూడు పువ్వులు ఆరు కాయలుగా బెల్ట్ షాపుల దందా..!
వేములవాడ నియోజకవర్గం , జనవరి 31 , న్యూస్ తెలంగాణ :- దక్షిణ కాశీగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ లో కొంతమంది వ్యక్తులు ఒక సమూహంగా ఏర్పడి వేల కాని వేళల్లో మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించడంతో మద్యం సేవించిన వ్యక్తుల ప్రవర్తన తీరుతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడ పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి సమయపాలన పాటించకుండా మద్యాన్ని ఎక్కువ రేటుకు విక్రయించి నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం పై పలు విమర్శలు బహిరంగంగా వ్యక్తమవుతున్నాయి.ప్రతిరోజు ఏదో ఒకచోట కొంతమంది వ్యక్తులు అత్యాశకు ఆశపడి మద్యాన్ని ఒకరోజు ముందే కొనుగోలు చేసి రాజన్న దర్శనానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను ఆసరాగా చేసుకుని పెద్ద మొత్తంలో దండుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే రాత్రి వైన్సులు, బార్లు సమయం దాటిందంటే వాటిని మూసివేయడంతో ఆ తర్వాత మద్యం విక్రయించే వ్యక్తులే రాజ్యమేలుతున్నట్లు తెలుస్తుంది. మధ్యవర్తులు వారు చెప్పిందే పైసా, వారు ఇచ్చిందే మద్యం అన్నట్లుగా వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతూ ఉండడం పై ఎక్సైజ్ అధికారుల ప్రమేయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయం ఉన్నటువంటి పట్టణంలో నియమ నిబంధనలను కట్టుదిట్టంగా చేసి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు, భక్తులు వేడుకుంటున్నారు.
#NewsTelanganaTv