
- చట్టం ముందు ఎవరు తప్పించుకోలేరు..
సూర్యాపేట జిల్లా చిలుకూరు మార్చి 26 : ( న్యూస్ తెలంగాణ )
హత్య కేసులో ముగ్గురు నేరస్తులకు జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్ సెషన్స్ ఎస్సీ .ఎస్టీ. నల్గొండ జిల్లా కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఎస్పీ నరసింహ తెలిపిన వివరాల ప్రకారం చిలుకూరు మండలం కట్ట కొమ్ముగూడెం రామాపురం గ్రామంలో 2019 మార్చి 15న దళితుడైన కుక్కల గోపిని అదే గ్రామానికి చెందిన షేక్ దస్తగిరి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన కస్తాల వెంకటరత్నం, కుక్కల రేణుక సహకారంతో ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్య చేశాడు. ఈ విషయమై మృతుని తల్లి కుక్కల పుష్పమ్మ చిలుకూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంలో పోలీసులు ఎస్సీ, ఎస్టీ. చట్టం కింద కేసు నమోదు చేశారు.
మృతుని భార్యతో నేరస్తుడు దస్తగిరికి పరిచయం కలిగి ఉండి ఒక పథకం ప్రకారం ట్రాక్టర్ తో తొక్కించి చంపారు అని నలుగురి పై కేసు నమోదు చేసి అప్పటి దర్యాప్తు అధికారి డీఎస్పీ సుదర్శన్ రెడ్డి విచారణ జరిపి నేర అభియోగ పత్రాలు దాఖలు చేశారు. 15 మంది సాక్షులు, బాధితులను విచారించిన ఎస్సీ, ఎస్టీ స్పెషల్ సెషన్స్ నల్గొండ జిల్లా కోర్టు జడ్జి రోజారమణి నిందితులు దస్తగిరి, వెంకటరత్నం, రేణుక నేరానికి పాల్పడినారని నిర్ధారించి నేరస్థులకు జీవితఖైదు, జరిమానా విధించారు. నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేసిన పీపీ అఖిల, లైజన్ ఆఫీసర్ కానిస్టేబుల్ సైదులు, కోర్టు డ్యూటీ హెడ్ కానిస్టేబుల్ రమేష్, పర్యవేక్షణ చేసిన కోదాడ డివిజన్ డీఎస్సీ శ్రీధర్ రెడ్డి, కోదాడ రూరల్ సీఐ రజితా రెడ్డి, ఎస్సై సురభి రాంబాబు ను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అభినందించారు.