October 16, 2025
News Telangana
Image default
Telangana

Telangana Assembly | రేపట్నుంచి అసెంబ్లీ సమావేశాలు.. భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!

Telangana Assembly | హైదరాబాద్ / News Telangana : రేపటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపధ్యంలో నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి. నరసింహా చార్యులు ముందస్తు సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జీఏడీ సెక్రటరీ రఘనంందన్ రావు, అడిషనల్ సెక్రటరీ (ఫైనాన్స్)- రాయ రవి, డైరెక్టర్ (ప్రోటోకాల్)- శివలింగయ్య హాజరయ్యారు. హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్, ఏడీజీ, లా& ఆర్డర్ మహేష్ భగవత్, అడిషనల్ సీపీ (లా & ఆర్డర్)- విక్రమ్ సింగ్ మాన్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు సుధీర్ బాబు, అవినాష్ మహాంతి, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ కర్ణాకర్, కౌన్సిల్ చీఫ్ మార్షల్ సంజీవ రెడ్డి కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ, శాసనసభ అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలి. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలి. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకోవాలి. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం జరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భారీ వర్షాలు కురిసి కొన్ని రూట్లలో రోడ్లు దెబ్బతిన్నాయి. ట్రాఫిక్ అధికారులు సమన్వయం చేసుకుని గౌరవ సభ్యులు సరైన సమయానికి సభకు చేరుకునే విధంగా సహకరించాలి. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలి, తద్వారా సమావేశాలు సజావుగా జరుగుతాయని స్పీకర్ పేర్కొన్నారు.

కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలి. అవసరమైన నోడల్ అధికారులను, లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలి. పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలి. తెలంగాణ పోలీసు దేశంలోనే సమర్ధవంతమైనది, మంచి పేరు ఉన్నది. మీ ఆధ్వర్యంలో శాసనమండలి సమావేశాలు సజావుగా జరిగే విధంగా సహకరించాలి అని సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు మాట్లాడుతూ… సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అవసరమైన అధికారులను అందుబాటులో ఉంచుతాం. సభా నిర్వాహణకు ఇబ్బందులు లేకుండా, సజావుగా జరిగే విధంగా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తాం అని ఆయన స్పష్టం చేశారు.

0Shares

Related posts

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే మురళి నాయక్

News Telangana

మండల వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

News Telangana

హైదరాబాద్ హెచ్ఎండిఏ కమిషనర్ : కాట ఆమ్రపాలి

News Telangana

Leave a Comment