
News Telangana :- మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో మాజీమంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతో సహా ఆ పార్టీ సీనియర్ నేతలు ఇవాళ(శుక్రవారం) ఎర్రవల్లి ఫాం హౌస్‌లో సమావేశం కానున్నారు. కేసీఆర్‌తో భేటీలో పలు కీలక అంశాలపై గులాబీ నేతలు చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపు(శనివారం) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో గులాబీ పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చర్చించనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు తమకు తగినంత సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదిక పెట్టడానికి ముందే తమకు రిపోర్ట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు. ఈమేరకు నిన్న (గురువారం) అసెంబ్లీ సెక్రటరీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఇంకోవైపు ఎప్పటిలానే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏం మాట్లాడతారనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే కేసీఆర్ అండ్ కోపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం..