
- నకిలీ డిడిలతో ఇసుక రవాణా
క్వారీలో అధికారుల తనిఖీలు.
పినపాక నియోజకవర్గ ప్రతినిధి( న్యూస్ తెలంగాణ) సెప్టెంబర్ 11:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో ఇసుకాసురులు బరితెగించారు. ఇసుకను ఇష్టానుసారంగా రవాణా చేసేందుకు ఏకంగా నకిలీ డీడీలు సృష్టించి దర్జాగా ఇసుకను తోలేస్తున్నారు. మణుగూరు రామానుజవరం ఇసుక రీచ్ లో నకిలీ డిడిలతో ఇసుకను తరలిస్తున్న లారీని అశ్వాపురం పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో శనివారం అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్సై రామారావు తమ సిబ్బందితో కలిసి నకిలీ డిడిలను గుర్తించేందుకు రామానుజవరం ఇసుక క్వారీ వద్ద నకిలీ డి డిల పై ఎంక్వయిరీ చేశారు. అధికారులు ఎంక్వయిరీ చేస్తున్న సమయంలో ఇసుక రీచ్ నిర్వాహకులు ఇసుక ర్యాంపు దగ్గర లేనట్లు సమాచారం. పక్కా నకిలీ వే బిల్లులు సృష్టించిన ఇసుకాసురులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. “పట్టుకున్నది ఒక్కటే ఇసుక లారీ”.. ఇలా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలు ఎన్నో సంబంధిత శాఖ అధికారుల పాత్ర ఎక్కువగానే ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి ప్రమేయం లేకుండా ఇసుకను సరిహద్దులు దాటించడం అంత సులువు కాదనే చెప్పాలి. పోలీసులు, టాస్క్ ఫోర్స్ కళ్ళు కప్పి అక్రమ డిడిలతో ఇసుకాసురులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటే వీరి వెనుక పెద్ద నెట్వర్క్ నడుస్తున్నట్లు సమాచారం.