
మేడిపల్లి అక్టోబర్ 12(న్యూస్ తెలంగాణ)సామాజిక సేవే తన లక్ష్యంగా,వెనుకబడిన తరగతులకు చెందిన గంగపుత్ర కుటుంబాల సంక్షేమమే పరమావధిగా తన తుదిశ్వాస వరకు వారి అభ్యున్నతికి పాటుపడిన చిరస్మరణీయుడు వెంకట లక్ష్మణ్ అని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీల సంక్షేమ సంఘాల సమాఖ్య చైర్మన్ డా.రాపోలు రాములు కొనియాడారు. కీర్తిశేషులు లక్ష్మణ్ 18వ వర్ధంతి పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ బోడుప్పల్ గంగపుత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పాక వెంకట లక్ష్మణ్ తో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ గంగపుత్ర కుటుంబాల యోగక్షేమాలు పరిరక్షించేందుకు, సంఘ భవనం నిర్మాణం కోసం వారు పడ్డ కష్టం,ఎదుర్కొన్న ఇబ్బందులు వివరించారు. శ్రీనివాస్ నగర్ కాలనీ ముఖ్య సలహాదారునిగా కూడా అనేక సంవత్సరాలు విశేషమైన సేవలు అందించారు.వారి స్మృతులు గంగపుత్రులకు అందరికీ మార్గదర్శకంగా ఉండగలవని వచ్చిన అతిథులు ఉద్ఘాటించారు. విచ్చేసిన అతిధులను సమాఖ్య కోర్ కమిటీ సభ్యులు, లక్ష్మణ్ కుమారుడు పి ఎల్ మధుసూదన్ ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సమాఖ్య వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షుడు అబ్రహాం లింకన్, ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి,కోశాధికారి బజ్జూరి శ్రీనివాస్ గుప్తా,గంగపుత్ర సంఘం బోడుప్పల్ అధ్యక్షుడు కూర బాలరాజు, ప్రధాన కార్యదర్శి బంగారి కుమారస్వామి,కోశాధికారి లింగమూర్తి,కార్యవర్గ సభ్యులు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.