
- ఎస్సై సురేష్ రెడ్డి
చిలుకూరు అక్టోబర్ 15: ( న్యూస్ తెలంగాణ )
మండల పరిధిలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో బుధవారం పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, ఎస్సై సురేష్ రెడ్డి మాట్లాడుతూ,సైబర్ మోసాలు, మత్తు పదార్థాల వినియోగం, మూఢనమ్మకాలు వంటి అంశాలపై విద్యార్థులకు విస్తృతమైన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలకు గురికాకుండా ఉండే జాగ్రత్తలు, గంజాయి వంటి మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సమాజంలో మంచి పౌరుడిగా మారే మార్గాలను విద్యార్థులకు సూచించారు, “సమాజంలో ఏదైనా సమస్యలు లేదా నేరాలు జరిగినప్పుడు పోలీసులకు సమాచారం అందించడం ప్రతి పౌరుడి బాధ్యత.ఫిర్యాదుల కోసం పలు ఫోన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి” అని తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చెప్పిన ‘పెద్ద కలలు కనండి – పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి’ అనే సందేశాన్ని గుర్తు చేశారు. విద్యార్థులు టెక్నాలజీని మంచి దిశగా ఉపయోగించి, అంతర్జాల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. “చిన్ననాటి నుండే సత్ప్రవర్తనతో ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుంది. నేరాలకు దూరంగా ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవండి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు,పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.